నేటి విశేషం అచ్చ తెలుగు పండుగ - అట్లతద్ది 2 m ago
గౌరీదేవి శివుని భర్తగా పొందాలనే కృత నిశ్చయంతో ఉందని త్రిలోక సంచారి అయిన నారదుడు తెలుసుకున్నాడు. ఆమె కోరిక ఫలించాలంటే అట్లతద్ది వ్రతం చేయమని నారదుడు సూచించాడు. ఆయన ప్రోద్బలంతో పార్వతీదేవి చేసిన వ్రతమే అట్లతద్ది. ఇది స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం. కన్నెపిల్లలు పడచువాణ్ణి పతిగా పొందాలనుకుంటే తప్పక ఆచరించవలసిన వ్రతమిది.
అట్ల తద్ది లేదా అట్ల తదియ తెలుగువారి ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఇది ఆశ్వయుజ బహుళ తదియ నాడు జరుపుకొంటారు. "అట్లతద్దె ఆరట్లు ముద్దపప్పు మూడట్లు" అంటూ ఆడ పడుచులకు బంధువులకు, ఇరుగు, పొరుగులకు వాయినాలివ్వటం పరిపాటి. సాయం సమయమందు వాయినాలు, నైవేద్యాలు పూర్తి చేసుకొని గోపూజకు వెళ్ళి, అటునుండి చెరువులలో కాలువలలో దీపాలను వదిలి, చెట్లకు ఊయలలు కట్టి ఊగటం చేస్తుంటారు.
త్రిలోక సంచారి అయిన నారదుని ప్రోద్బలముతో గౌరీదేవి శివుని పతిగా పొందగోరి తొలుతగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్త్రీలు సౌభాగ్యము కోసం చేసుకొనే వ్రతమిది. చంద్రారాధన ప్రధానమైన పూజ, చంద్రకళల్లో కొలువైవున్నశక్తి అనుగ్రహం చేత స్త్రీసౌభాగ్యము పెరుగుతుంది. కుటుంబములో సుఖశాంతులు వర్దిల్లుతాయని శాస్త్రవచనం. ఈ పండగలో అమ్మవారికి అట్లు నైవేద్యముగా పెట్టడములో ఒక అంతరార్ధముంది. నవగ్రహాలలోని కుజుడుకీ అట్లంటే మహాప్రీతి. అట్లను ఆయనకు నైవేద్యముగాపెడితే కుజదోషపరిహారమై సంసారసుఖములో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకము. రజోదయమునకు కారకుడు కనుక ఋతుచక్రం సరిగావుంచి ఋతుసమస్యలు రానివ్వకుండా కాపాడుతాడు. అందువలన గర్భధారణలో ఎటువంటి సమస్యలుండవు. మినుములు పిండి, బియ్యము పిండి కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువునకు, బియ్యము చంద్రునకు సంబంధించిన ధాన్యాలు. గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనముగా ఇవ్వాలి. గర్భస్రావము రాకుండా, సుఖప్రసవం అయ్యేందుకు దోహదపడుతుంది కూడా. అందుకే ముత్తయిదువులకు అట్లను వాయనముగా ఇస్తారు. అట్లతద్దిలోని 'అట్ల'కు ఇంతటి వైద్యవిజ్ఞానము నిక్షిప్తం చేయబడివుంది. అట్లతద్ది పండుగను ఉత్తర భారతదేశంలో 'కర్వా ఛౌత్' అనే పేరుతో జరుపుకుంటారు.
గోరింటాకు
గోరింటాకు- అట్లతద్దికి ముందురోజున ఆడవారంతా కలిసి గోరింటాకుని పెట్టుకుంటారు. సంవత్సరంలో ఎప్పుడు గోరింటాకు పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా ఆషాఢమాసం, అట్లతద్ది వంటి సందర్భాలలో గోరింటను తప్పక పెట్టుకోవాలని పెద్దలు ప్రోత్సహిస్తూ ఉంటారు. ఆయాకాలాలలో ఉండే వాతావరణ పరిస్థితులే దీనికి కారణం. అక్టోబరు లేదా నవంబరు మాసాలలో వచ్చే అట్లతద్ది సమయానికి చలికాలం మొదలైపోతుంది. వాతావరణంలో తగినంత వేడి లేకపోవడం వల్ల రకరకాల చర్మవ్యాధులు దాడి చేసే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా ఇంటిపనుల్లో నిమగ్నమై ఉండే ఆడవారు నిరంతరం తడిలో ఉండటం వల్ల వారి వేళ్లు, గోళ్లు నాజూకుదనాన్ని కోల్పోవడమే కాకుండా ఫంగస్ బారిన పడే అవకాశం ఉంది. దీనికి విరుగుడు గోరింటాకని ప్రత్యేకించి చెప్పేదేముంది. అయితే గోరింటాకు పెట్టుకున్న పడుచులు కుదరుగా ఉంటారని చెప్పలేం. ఎప్పుడెప్పుడు దానిని కడిగేసుకుందామా అన్న తొందరలో ఉంటారు. బహుశా వారిని అదుపు చేసేందుకే ‘గోరింట ఎంతబాగా పండితే అంత మంచి మొగుడు వస్తాడు’ అని ఊరిస్తారు కాబోలు.
చద్దన్నం
చద్దన్నం- అట్లతద్ది ఉదయాన్నేలేచి గోంగూర, పెరుగుతో చద్దన్నం తినడంతో వ్రతం మొదలవుతుంది. సాధారణంగా ఏకాదశి వంటి ఉపవాస సమయాలలో ఉదయం లేదా అంతకు ముందు రోజు రాత్రి నుంచే ఉపవాసం మొదలవుతుంది. కానీ అట్లతద్దినాడు ఆడపిల్లలకు బోలెడు పనయ్యే! అందుకని వారు నీరసించి పోకుండా ఉండేందుకు ఈ ఫలహారం ఉపయోగపడుతుంది. పెరుగు కడుపుని చల్లగా ఉంచితే, ఆ పెరుగు వల్ల ఏర్పడే కఫానికి విరుగుడుగానూ, చలి వాతావరణాన్ని తట్టుకునేందుకూ గోంగూర ఉపయోగపడుతుంది.
తాంబూలం
తాంబూలం- ఒకపక్క ఉపవాసం ఉంటూనే తాంబూల సేవనం చేసే ఆచారాన్ని కొంతమంది పాటిస్తారు. దీని వలన ఉపవాసంతో నోరు పొడిబారిపోకుండా ఉంటుంది. పైగా కడుపులో ఆహారం లేకపోతే చాలామందికి తలనొప్పి వస్తుంటుంది. తాంబూలం తలనొప్పికి దివ్యోషధం అంటుంది ప్రాచీన వైద్యం. ఇక తాంబూలానికి ఒంట్లో కొవ్వుని కరిగించే శక్తి కూడా ఉందట. తాంబూలాన్ని విలాసవంతులకు పరిమితమైన అలవాటుగా సమాజం భావిస్తుంటుంది. అలాంటి తాంబూలాన్నీ అట్లతద్ది రోజున ఆడవారంతా నిర్భయంగా వేసుకుంటారు. గోరింటతో ఎర్రగా పండిన చేతులతో, తాంబూలంతో ఎరుపెక్కిన అధరాలతో దేవకన్యలకు తీసిపోకుండా ఉంటారు.